నల్లధనం నియంత్రణపై ప్రధాని సంచలన ప్రకటన రూ.500, రూ.1000 నోట్ల రద్దు గతంలోనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరిన ఏపీ సీఎం

నల్లధనం నియంత్రణపై ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇకపై రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయనున్నట్లు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. డిసెంబరు 30లోపు డిపాజిట్‌ చేయనివారు.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు కూడా పనిచేయవని పేర్కొన్నారు.

అయితే గతంలోనే చంద్రబాబు నల్ల ధనం నియంత్రణపై ఇలాంటి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరడం గమనార్హం. ఇప్పుడు ప్రధాని ప్రకటన చూస్తే చంద్రబాబు ఫార్ములాను కాపీ కొట్టారని అనుమానం రాక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నల్లధనం నియంత్రణపై టీడీపీ కార్యాలయంలో కొన్నాళ్ల కిందట మీడియాతో మాట్లాడుతూ నల్లధనం నియంత్రణపై పలు సూచనలు చేశారు.

వెయ్యి రూపాయల నోట్లు, రూ.500 నోట్ల మూలంగా చాలా అనర్థాలు వస్తున్నాయి. అవి ముద్రించగానే.. నల్లధనంగా మారుతున్నాయి. విదేశాలకు వెళ్లిపోతున్నాయి. ఆ డబ్బతోనే అరాచకం, అవినీతి, అశాంతి వంటివి ఏర్పాడుతున్నాయి. దీనిని నిరోధించాల్సిన సమయం వచ్చింది. గతంలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి దాపురిస్తే.. 1969లో నిక్సన్ వంద డాలర్ల నోట్లను రద్దు చేశారు. దీంతో నల్లధనం సమస్య పోయింది. మన దేశంలోనూ ఈ సమస్య పోవాలంటే రూ1000, రూ.500 నోట్లను రద్దు చేయాలి. దేశంలో రూ.70 లక్షల కోట్ల నల్లధనం ఉందని అంచనా. అని పేర్కొన్నారు.

 ఈ వ్యాఖ్యలు చూశాక లేటుగానైనా చంద్రబాబు ఫార్ములానే మోదీ కాపీ కొట్టారని అనిపించకమానదు . ఇక చంద్రబాబు ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై ఏలా స్పందిస్తారో... తాను ముందే ఈ విషయం చెప్పానని డప్పా కొట్టుకుంటారో వేచి చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు చెప్పినట్లే నోట్ల రద్దు జరిగిందనన్నది మాత్రం నిజం.