Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో టీడీపీ లేదన్నవాళ్లకు ఖమ్మం సభే సమాధానం: చంద్రబాబు

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ లేదన్న వాళ్లకు ఖమ్మం సభే సమాధానమని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన టీడీపీ శంఖారావం బహిరంగ సభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడి..  పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం సభ ప్రేరణతో నాయకులు, కార్యకర్తలు మళ్లీ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.  

Chandrababu Naidu Public Meeting at Khammam
Author
First Published Dec 22, 2022, 6:21 AM IST

సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయినా దేశంలో ఆదర్శంగా నిలపాలన్నదే టీడీపీ అభిమతమని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి రంగంలో తెలుగు రాష్ట్రాలు దేశంలో మొదటి రెండు స్థానాల్లో నిలపాలన్నదే తన చిరకాల వాంఛ అని చెప్పారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన టీడీపీ శంఖారావం బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం సభ ప్రేరణతో నాయకులు, కార్యకర్తలు మళ్లీ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. చాలా సార్లు ఖమ్మం వచ్చాను కానీ.. ఇంత భారీ స్థాయిలో స్వాగతం ఎప్పుడూ చూడలేదని అన్నారు. హైదరాబాద్ నుంచి అడుగడుగునా ప్రజలు స్వాగతం పలికారని అన్నారు. తన పార్టీ సభకు ప్రజలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. తన హయంలో ఐటీ ద్వారా ఉపాధిని ఇచ్చారనే అభిమానంతో యువత కదలి వచ్చిందన్నారు.   

ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి జరపుకుంటున్నామనీ, అలాగే..టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుందని అన్నారు. తెలుగు వాళ్ల కోసం తెలంగాణ గడ్డపై నాడు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. సమైఖ్య రాష్ట్రంలో టీడీపీ పాలనతో పెనుమార్పులు వచ్చాయనీ,అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని,  జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు. రెండు రూపాయాలకే కిలో బియ్యంతో ఆహారభద్రతకు బీజం వేసింది ఎన్టీఆరేననీ,  తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం ఇచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. 

తమ ప్రభుత్వ పాలనలో సింగిల్ విండో విధానంతో పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెట్టారనీ,  ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం కాపాడారని అన్నారు. తాను తెలుగు వారిలో ఆత్మవిశ్వాసం నింపాననీ,  ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపితే ప్రపంచాన్నే జయిస్తారని తెలుగు దేశం పార్టీ నిరూపించిందని అన్నారు. తాను వయసులో పెద్దవాడినే అయినా...యువకుడిలా ఆలోచిస్తాననీ, రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి పని చేస్తాననీ అదే తన పరిపాలన విధానమని అన్నారు. తాను ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఎప్పుడూ పని చేయలేదని, ప్రజల ప్రగతి కోసం నిరంతరం క్రుషి చేస్తామని అన్నారు. 
 
తాను ఐటీలో అవకాశాలను ముందుగానే ఊహించి హైటెక్ సిటీ ప్రారంభించాననీ, దేశ విదేశాలు తిరిగి కంపెనీలు తెచ్చాననీ, బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ తెచ్చానని తెలిపారు.  నాడు జినోం వ్యాలీ తీసుకురావడం వల్లే నేడు కరోనా వ్యాక్సిన్ వచ్చిందని అన్నారు. టెలికమ్యూనికేషన్ సంస్కరణలతో మొబైల్ ఫోన్ రావడానికి కారణం అయ్యామని తెలిపారు.

పాలసీనే మార్చి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తెచ్చామనీ, నాడు ప్రధాని వాజ్ పేయికి చెప్పి ఒప్పించి.. స్వర్ణచతుర్భుజం ప్రాజెక్టు తెచ్చామని, దీంతో రాష్ట్రంలో విశాలమైన రోడ్లు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చింది.నల్గొండలో ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు తీర్చింది టీడీపేననీ అన్నారు. తెలంగాణలో ఉన్న నేతలు అంతా యాక్టివ్ కండనీ, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు, తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios