సనత్ నగర్: సనత్ నగర్ సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే తనకు పాతరోజులు గుర్తుకు వస్తున్నాయని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ప్రజాకూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ 15 స్థానాలు గెలిస్తే టీఆర్ ఎస్ ఒక్కస్థానానికే పరిమితమైందని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్ నగరం ఒక విజ్ఞాన నగరమని కొనియాడారు. సీఎంగా ఉన్న సమయంలో ఆకస్మిక తనిఖీల్లో హైదరాబాద్ లో గల్లీ గల్లీ తిరిగానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. 

మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందన్నారు. కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాన్ని అభివృద్ది చేశాయని చెప్పుకొచ్చారు.హైదరాబాద్ ను ప్రపంచ పటంలో తీసుకెళ్లింది తానేననని చంద్రబాబు తెలిపారు. 

అంతేకాకుండా హైటెక్ సిటీ, శిల్పారామం, జినోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రం, కృష్ణా నీటిని హైదరాబాద్‌కు తెచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ప్రపంచ పటంలో నగరాన్ని పెడితే ఎగతాళి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ఓ నాలెడ్జ్ కేంద్రం, తెలుగు వారికోసం మైక్రోసాఫ్ట్ తరహా అనేక కంపెనీలు తీసుకురావడానికి కృషి చేశానన్నారు.

తాను సైబరాబాద్ ను నిర్మించానని చెప్పానే తప్ప హైదరాబాద్ ను నిర్మించానని ఏనాడు చెప్పలేదన్నారు. సైబరాబాద్ నిర్మాణం తనవల్లే జరిగిందన్నారు. అయితే కొంతమంది హైదరాబాద్ తానే నిర్మించానని తానే చెప్పినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 

హైదరాబాద్ మహానగరానికి కృష్ణానది వాటర్ ను తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనన్నారు. హైదరాబాద్ కు గోదావరి నీటిని తీసుకువచ్చేందుకు ప్రారంభించింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మెట్రో రైలుకు తాను శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లిందన్నారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఆలస్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. 

విభజన సమయంలో హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణకు 58శాతం, ఆంధ్రాకు 42 శాతం పంచారన్నారు. 54శాతం ఆదాయంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశించానన్నారు. అయితే హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సింది పోయి నష్టపోయిందన్నారు. 58శాతం ఆదాయం ఉన్న తెలంగాణను అప్పలుపాల్జేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను ఏనాడు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 37 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటీపడ్డాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రెండు పార్టీల లక్ష్యాలు వేరన్నారు. అయితే 37 ఏళ్ల అనంతరం తాము ఒక్కటయ్యామని చెప్పారు. అది తమ స్వార్థం కోసం ఒక్కటవ్వలేదని దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఒక్కటయ్యామని చెప్పుకొచ్చారు.  
 
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దోపిడీ జరుగుతుందని బెదిరింపులు ఎక్కువయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం అన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని చంద్రబాబు దుయ్యబుట్టారు. నోట్ల రద్దు అంశం దగ్గర నుంచి ట్రిపుల్ తలాక్ వరకు ఇలా అన్ని రంగాల్లో కేంద్రం బెదిరింపు దాడులకు పాల్పడుతుందన్నారు.  

దేశంలో మైనారిటీలకు రక్షణ కావాలన్నా, దళితులపై దాడులు ఆగాలన్నా బీజేపీని ఓడించాలని చంద్రబాబు సూచించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. 

ఇకపోతే 2018 మార్చి 3న ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా పోరాటం చెయ్యాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ సూచించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్  చెయ్యడంతోపాటు, తన వల్లే సందప పెరిగిందని చెప్పింది ఎంపీ కవిత కాదా అని ప్రశ్నించారు.  

తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు వల్లేనని, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చిందంటే అది చంద్రబాబు కృషేనని గతంలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని తమ అకౌంట్లో వేసుకోలేమని కేటీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని చంద్రబాబుగుర్తు చేశారు.  
 
అలాంటి నన్ను ఎందుకు తిడుతున్నారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇంత అభివృద్ధి చేసిన తనను సంస్కారం లేకుండా కేసీఆర్ ఎందుకు తిడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. తాను ఏనాడైనా టీఆర్ఎస్ గురించి మాట్లాడానా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డానా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేస్తుంటే కేసీఆర్ తనను తిడతారని ధ్వజమెత్తారు. 

ఏ విషయంలో తాను అడ్డుపడ్డానో చెప్పాలని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేనందుకు అడ్డుపడ్డా మహిళలకు మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుపడ్డానా..? డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతానంటే అడ్డుపడ్డానా..?హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేస్తే అడ్డుపడ్డానా..? ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తాను అంటే అడ్డుపడ్డానా..? అంటూ టీఆర్ఎస్ పార్టీ లోపాలను చంద్రబాబు ఎత్తి చూపారు. 

టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలని చంద్రబాబు నిలదీశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్తగా రోడ్డేశారా...గుంతలు పడితే మట్టిపోశారా, ఎందుకు ఓటు వెయ్యాలని అని కేసీఆర్ ని సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు. 

  డబుల్ బెడ్ రూం ఇళ్లు అన్నారు ఎక్కడ ఒక్క ఇళ్లు అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు ఎక్కడ ఇచ్చారని నిలదీశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తానన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేసీఆర్ బెదిరింపు ధోరణిలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. మైనార్టీలకు రక్షణ కావాలన్నా, దళితులకు న్యాయం జరగాలన్నా బీజేపీని ఇంటికి పంపించాలని కేసీఆర్ ను ఓడించాలని ప్రజాకూటమిని గెలిపించాలని చంద్రబాబు కోరారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు ఏకమయ్యాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లాలూచీ అయ్యానన్నారు. అలాగే వైసీపీ కూడా లాలూచీ పడిందన్నారు. లాలూచీ పడి ఇప్పుడు నాటకాలు ఆడుతుందని విమర్శించారు. 

రెండు రోజులుగా కేసీఆర్ బీజేపీని విమర్శించడం, బీజేపీ విమర్శిస్తూ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎంలు నాలుగు పార్టీలు లాలూచీ పడ్డాయని పార్టీలు వేరైనా భావం ఒక్కటేనన్నారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి, ఎంఐఎంకు ఓటు వేసినట్లేనన్నారు. 

తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. రేపటి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. డబ్బులు ఖర్చుపెడతారు. దేనికి ఆశపడొద్దని పిలుపునిచ్చారు. ఆఖరికి ఈవీఎంల పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. 

మేనిక్యులేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడా అవకతవకలు లేకపోతే తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 

తెలుగుజాతి ఒక్కటి అనుకుంటే రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు ఉండవని, నీటి సమస్యలు అస్సలే ఉండవన్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని తాను ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. గోదావరిలో 230 టీఎంసీల నీళ్లు వృద్ధాగా పోతున్నాయి. తెలంగాణలో ప్రజాకూటమి గెలిస్తే ఒక్క చుక్క నీరు కూడా వృద్ధా పోకుండా చూస్తానని చెప్పుకొచ్చారు. 

బంగారు తెలంగాణ సాధనయే తన లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని అదే తన కోరిక అని చంద్రబాబు చెప్పారు. తాను వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తాను హైదరాబాద్ లో పెత్తనం చెలాయించాలని చూసే వ్యక్తిని కాదన్నారు. 12 మంది అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మంచి పాలన అందించాలన్నదే తన లక్ష్యమన్నారు.