హైదరాబాద్: దేశచరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఏకమయ్యాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 37 సంవత్సరాలు కాంగ్రెస్ పై తెలుగుదేశం పార్టీపై పోరాటం చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే మోదీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల తాము ఏకం కావాల్సి వచ్చిందన్నారు. తాము స్వార్థ రాజకీయాల కోసం కాకుండా దేశసమైక్యత కోసం కలిశామన్నారు.

 నాంపల్లి అసిఫ్ నగర్ లో ప్రజాకూటమి రోడ్ షోలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు పాల్గొన్నారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత గులాం నబీ ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నేత ముహమ్మద్ అజరుద్దీన్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు ప్రజాకూటమి నేతలు అభ్యర్థులు పాల్గొన్నారు. నాంపల్లి ప్రజాకూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మహ్మద్‌ఫిరోజ్‌ ఖాన్‌ ను గెలిపించాలని చంద్రబాబు కోరారు.  

దేశంలో మోదీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందన్నారు. ఈడీ, ఐటీ దాడులతో అందర్నీ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. అలాగే రిజర్వుబ్యాంకు, సీబీఐ లాంటి అత్యున్నత వ్యవస్థలను కూడా నాశనం చేసిందన్నారు. 

దేశంలో రెండే రెండు ఫ్రంట్ లు ఉన్నాయని అవి ఎన్డీఏ, నాన్ ఏన్డీఏ మాత్రమేనన్నారు. నాన్ ఎన్డీఏ ఫ్రంట్ లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని అలాగే అన్ని పార్టీలను ఏకం చేస్తామన్నారు. మోదీ బెదిరింపులు, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు మా విధానాలను పక్కన పెట్టి ఏకమయ్యామన్నారు. దేశ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ ను నిర్మిస్తే తాను సైబరాబాద్ నిర్మించానని తెలిపారు. ప్రపంచానికి మేధావులను అందించే శక్తి హైదరాబాద్ కు ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏలో ఉందన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేనని చంద్రబాబు తెలిపారు.  
 
ఏర్పడబోయే ఫ్రంట్ లో ఎంఐఎం పార్టీ ఎటువైపు ఉంటుందో చెప్పాలన్నారు. దేశ రాజకీయాల్లో ఎవరివైపు ఉంటారో చెప్పాలని ఎంఐఎంను చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో కేంద్రప్రభుత్వ విధానాల వల్ల  ప్రజలు నష్టపోతున్నారని దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదకర పరిస్థితి చోటు చేసుకుందన్నారు. 

తెలంగాణ ఎన్నికలు రేపు జాతీయ స్థాయిలో జరగబోయే ఎన్నికలకు నాంది అని చంద్రబాబు చెప్పారు. మంచి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారని ప్రజలు గమనించి ప్రజాకూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో తాను పెత్తనం చేసేందుకు  రాలేదన్నారు. హైదరాబాద్ కోసం తాను కష్టపడ్డానని తెలిపారు. తన కష్టానికి తగ్గ ఫలితం ప్రజలకు దక్కలేదని అందువల్లే తాను వచ్చానన్నారు. 

రేపు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతారని టీడీపీ అభ్యర్థి అవ్వరన్నారు. దేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు. 

అభద్రతా భావంలో ఉన్న ముస్లిం సోదరులను రక్షించేందుకు తాము ఏకమయ్యామన్నారు. దళితులపై దాడులు అరికట్టాలంటే బీజేపీని గద్దె దించాల్సిందేని పిలుపునిచ్చారు. దళితులపై దాడులు, ముస్లింలపై దాడులకు పాల్పడటం దేశ సుస్థిరతకు మంచిది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.  

ఎంఐఎం పార్టీ ఏపార్టీ వైపు ఉంటారో తెల్చుకోవాలని చంద్రబాబు కోరారు. టీఆర్ఎస్ తో ఎంఐఎం జతకట్టిందని అయితే టీఆర్ఎస్ బీజేపీతో ఉందని ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు. టీఆర్ఎస్ తో ఎంఐఎం జతకట్టడం టీఆర్ఎస్ బీజేపీతో లాలూచీ పడటం ఎవరికి లాభమో గమనించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఏ పక్షాన ఉంటారో తేల్చుకోవాలని ఎంఐఎంకు చంద్రబాబు సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి