హైదరాబాద్‌లో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ .. చంద్రబాబుపై సాంగ్ కంపోజ్ చేసి, పాడిన అనూప్ రూబెన్స్
హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు వేసిన సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నగరంలో ఆదివారం సాయంత్రం సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ (కృతజ్ఞత సంగీత కచేరీ) జరిగింది.
హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పునాదులు వేసిన సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నగరంలో ఆదివారం సాయంత్రం సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ (కృతజ్ఞత సంగీత కచేరీ) జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ , ఆయన బృందం సభకు వచ్చిన వారిని తమ సంగీతంతో ఉర్రూతలూగించింది. అనూప్ రూబెన్స్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ‘‘సీబీఎన్ .. సీబీఎన్ ’’ సాంగ్ స్టేడియంలో మోత మోగించింది. ఆ పాట పడుతున్నంత సేపు సీబీఎన్, సీబీఎన్ అనే నినాదాలు మారుమోగాయి.
ఇకపోతే.. సైబర్ టవర్స్ నిర్మాణం, ఐటీ అభివృద్ధిపై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మద్ధతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులతో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కొలికపూడి శ్రీనివాసరావు, ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
అయితే చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. బండ్ల గణేష్ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు పేరు మాత్రమే కాదని, ఓ బ్రాండ్ అని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమించడమే చంద్రబాబు చేసిన నేరమా అని గణేష్ ప్రశ్నించారు. ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని వెనుక చంద్రబాబు కృషి వుందని గణేష్ చెప్పారు. కులీకుతుబ్ షా హైదరాబాద్ కట్టాడని.. 400 ఏళ్లుగా చెప్పుకుంటున్నారని, అలాగే సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమేనని.. అలాంటి వ్యక్తి దేశానికి అవసరమని బండ్ల గణేష్ అన్నారు.