మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబుపై కేసిఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరువురి మధ్య దాదాపుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. తెలంగాణలో చంద్రబాబు తిరిగి వేలు పెట్టాలని అనుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 

హైదరాబాద్: బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య కూడా దూరం పెరిగింది. బిజెపికి తెలుగుదేశం పార్టీ దూరమవుతున్న క్రమంలోనే కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు కేసిఆర్ పై కూడా మండిపడుతున్నారు. 

మహా కూటమి ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబుపై కేసిఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరువురి మధ్య దాదాపుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. తెలంగాణలో చంద్రబాబు తిరిగి వేలు పెట్టాలని అనుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 

కాగా, కేసిఆర్ ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెసు నేతృత్వంలోని మహా కూటమి ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తోంది. కాంగ్రెసు నుంచి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. వారి బహిరంగ సభలు ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారని అంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందుకు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోసం నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ విడత ప్రచారం చేశారు 

హైదరాబాద్, దాని పరిసరాల్లో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. వారికి భరోసా కల్పిస్తూ చంద్రబాబు ప్రచారం సాగవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపికి ఎక్కువ బలం ఉంది కూడా ఈ ప్రాంతాల్లోనే. ప్రధానంగా టీడిపి ఎక్కువ సీట్లు కూడా ఇక్కడే తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అందువల్ల చంద్రబాబు రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని భావిస్తున్నారు. కేసిఆర్ తో నెయ్యం ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రచారాన్ని ధీటుగానే సాగించవచ్చునని అంటున్నారు.