తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి.. టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహాకూటమి గెలుపు కోసం తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా..ట్విట్టర్ వేదికగా.. ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కేవలం ప్రజల కోసం తమ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ.. పల్లకీ మోస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  పదవులు ఆశించకుండా.. కేవలం ప్రజలకు మేలు జరగాలని శ్రమిస్తున్నారన్నారు. కూటమి గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని టీడీపీ నేతలు పాటుపడుతున్నారన్నారు.

‘‘అన్ని వనరులున్నా సమర్థవంతమైన నాయకత్వం లేక తెలంగాణ రాష్ట్రం నేడు సమస్యలు ఎదుర్కొంటోంది. ఇబ్బందులు పడుతోంది. అందుకే టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని, సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజాకూటమికి మద్దతిస్తున్నాము.’’ అని చంద్రబాబు అన్నారు.

‘‘ కేంద్రం అన్యాయం చేసినా తెలుగుజాతిగా కలిసి పనిచేద్దాం అంటే కేసీఆర్ కలిసి రాకపోగా, మోదీతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క మంచి పనిచేయలేక ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు.’’ అంటూ ట్విట్టర్ లో  కేసీఆర్ పై  మండిపడ్డారు