Asianet News TeluguAsianet News Telugu

చాక‌లి ఐల‌మ్మ పోరాటం బహుజన జాగృతికి, మహిళాశక్తికి ప్రతీక : సీఎం కేసీఆర్

Hyderabad: చాక‌లి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె ధైర్యసాహసాలను స్మరించుకున్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో బహుజన జాగృతికి, మహిళా శక్తికి ప్రతీక చిట్యాల ఐలమ్మ అని పేర్కొన్నారు. ఆమె పోరాటం తెలంగాణ ఉద్య‌మ పోరాటంలో స్ఫూర్తిని నింపింద‌ని  తెలిపారు. 
 

Chakali Ailamma's struggle is a symbol of Bahujan awareness and women's strength: CM KCR  RMA
Author
First Published Sep 10, 2023, 4:53 PM IST

CM KCR recalls bravery of Chityala Ailamma: తెలంగాణ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ (చాక‌లి ఐల‌మ్మ‌) చూపిన ధైర్యసాహసాలు, ధృఢ సంకల్పాన్ని స్మరించుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చేసిన గొప్ప పోరాటాన్ని కొనియాడారు. ఆమె 38వ వర్ధంతి ఆదివారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ చాక‌లి ఐల‌మ్మ‌ను గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు. ఆమెను స్మరించుకున్న కేసీఆర్.. బహుజన జాగృతికి, మహిళా శక్తికి ఆమె ప్రతీక అని కొనియాడారు. ఐలమ్మ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన స్ఫూర్తితోనే తెలంగాణ కోసం తొలి పోరాటం సాగిందని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణ ఉద్యమ వీరులను స్మరించుకుంటూ ప్రభుత్వం ప్రతి ఏటా ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

తెలంగాణలో మహిళా సాధికారతకు ఐలమ్మ ప్రతీక :  మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రతీక చాకలి ఐలమ్మ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఐలమ్మ జీవితం నుంచి స్ఫూర్తిని పొందిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఇతర నాయకులు ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ఐలమ్మ గౌరవార్థం నిర్వహించాలని నిర్ణయించారని హరీశ్ రావు తెలిపారు.

రజక సామాజిక వర్గాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించిన మంత్రి సిద్దిపేటలో ప్రభుత్వం ఆధునిక ధోబీఘాట్ ను నిర్మించిందన్నారు. కులవృత్తులపై ఆధారపడిన వారి జీవితాలను మెరుగుపర్చడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా రజక సామాజికవర్గంలోని నిరుద్యోగులు సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వి.రోజాశర్మ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios