హైద‌రాబాద్: కిరాణా దుకాణంలో ఒంటరిగా వున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు ఓ ఘరానా దొంగ. హైదరాబాద్ శివారులోని ఎల్బీ నగర్  బైరామల్ గూడ మల్లిఖార్జున నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

ఈ చోరీకి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మల్లిఖార్జున నగర్ కాలనీలో సుజాత అనే మహిళ కిరాణా షాప్ నిర్వహిస్తోంది. అయితే ఆదివారం ఆమె షాప్ లో వుండగా ఓ వ్యక్తి సిగరెట్, చిప్స్ కావాలంటూ వచ్చాడు. దీంతో ఆమె అవి తీసివ్వడానికి వెనక్కి తిరిగ్గానే అమాంతం మెడలోని 4తులాల పుస్తెలతాడును లాక్కున్నాడు. దీంతో షాక్ కు గురయిన సుజాత తేరుకుని అరుస్తూ షాప్ లోంచి బయటకు వచ్చేలోపై స్నాచర్ అక్కడినుండి పరారయ్యాడు.  

ఇక చేసేదేమిలేక బాధితురాలు ఎల్బీ నగర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాలనీలో వున్న సీసీ కెమెరాల‌ సాయంతో చైన్ స్నాచర్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.