హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశించారు. 

రేవంత్ రెడ్డి స్టార్ కాంపైనర్ అని అయన రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించొచ్చని రజత్ తెలిపారు. రేవంత్ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేసుకోవచ్చని కూడా తెలిపారు. సిఈవో ఆదేశాల నేపథ్యంలో జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న రేవంత్ ను కట్టుదిట్టమైన భద్రత నడుమ కొడంగల్ కు తరలించారు. 

ఈనెల రెండున కేసీఆర్ సభపై రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామని ప్రకటించారు. అంతేకాదు 4న కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం 3గంటల సమయంలో రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు.