తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను (Somesh Kumar) ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే దీనిని తెలంగాణ సర్కార్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను (Somesh Kumar) ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే దీనిని తెలంగాణ సర్కార్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏపీ, తెలంగాణల మధ్య అఖిల భారత స్థాయి ఉద్యోగుల విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను ఏపీకి కేటాయించగా.. దానిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ Central Administrative Tribunal(క్యాట్‌)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమేశ్‌ పిటిషన్‌ను విచారించిన క్యాట్‌... ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు.

అయితే సోమేష్ కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్‌పై జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం తిరిగి విచారణ చేపట్టింది. సోమేష్ కుమార్‌కు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌పై స్టే ఇవ్వాలని(ఆయన ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది) కేంద్రం పట్టుబడుతుంది. అయితే తెలంగాణ మాత్రం.. ఈ దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బ్యూరోక్రాటిక్ సమతుల్యత దెబ్బతింటుందని, ఫలితంగా రెండు రాష్ట్రాల్లో సీనియారిటీ గొడవలు తలెత్తుతాయని పేర్కొంది.

భారత ప్రభుత్వ వ్యక్తిగత శిక్షణ విభాగం (DOPT) తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి (Suryakaran Reddy) వాదనలు వినిపించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కేటాయించేందుకు మార్గదర్శకాలను రూపొందించిందని.. అయితే AIS అధికారిగా ఉన్న ప్రత్యూష్ సిన్హా కుమార్తెకు ఆమె నచ్చిన రాష్ట్రం పొందేలా వ్యక్తిగత లబ్ధి పొందారని సోమేశ్ కుమార్ క్యాట్ ముందు ఆరోపించారని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సమానమైన AIS అధికారుల పంపిణీ కోసం రూపొందించిన మొత్తం ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను తప్పుబట్టడం సరైనది కాదన్నారు.

ఏపీ-తెలంగాణ మధ్య విభజన జరగనున్న బ్యూరోక్రాట్ల జాబితాలో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి పేరును చేర్చకపోవడంపై సోమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. 2014 జూన్ 1 అర్ధరాత్రి పదవీ విరమణ చేస్తున్నందున పీకే మొహంతి పేరును జాబితాలో చేర్చడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సోమేష్ కుమార్.. స్వాప్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక అధికారి PK మొహంతి చాలా ముందుగానే పదవీ విరమణ చేసినందున.. అతను ఆ ప్రయోజనం పొందే అవకాశం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు. 

నిబంధనల ప్రకారం.. రిటైర్డ్ అధికారితో స్వాపింగ్ అనుమతించబడదన్నారు. అఖిల భారతీయ సర్వీసులకు ఎంపికైన ఏ అభ్యర్థి అయినా తనకు కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఆదేశిస్తున్నాయని.. తనకు నచ్చిన రాష్ట్రానికి కేటాయించేలా అడిగే హక్కు అతనికి లేదని అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు. క్యాట్ ముందు సోమేష్ కుమార్ లేవనెత్తిన వాదనలన్నీ అవాస్తవమని చెప్పారు.

అఖిల భారత సర్వీసు అధికారి ఎక్కడ కేటాయిస్తే అక్కడ పనిచేయాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్పిందని గుర్తుచేశారు. CAT సోమేష్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ నేరుగా ఉత్తర్వులు జారీ చేయరాదని అన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వుల్లోని లోపాన్ని ఎత్తిచూపాలని కోరుతూ హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇక, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ సర్కార్.. డీఓపీటీ అనేది క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ అని కేంద్రం వాదనతో అంగీకరించింది. అయితే ఇప్పుడు ఏదైనా మార్పు చోటుచేసుకుంటే.. రెండు రాష్ట్రాల్లోని చక్కటి బ్యూరోక్రాటిక్ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. బాధిత అధికారుల కేసుకు సంబంధించిన వాస్తవాల ఆధారంగా క్యాట్ ఆర్డర్‌ను కూడా సమర్థించింది. ‘‘మా రాష్ట్ర పరిపాలనలో వారు సంపాదించిన నైపుణ్యాన్ని మేము కోల్పోలేము’’ అని ఉన్నత అధికారులు సోమేష్, వాణీ ప్రసాద్, కరుణా వాకాటి, ఎం ప్రశాంతి కేసులను ఉటకింస్తూ వాదించింది.