తెలంగాణ రోడ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న రూ. 202.3 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ ప్రతిపాదనల గురించి పలు దఫాలుగా కిషన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం గడ్కరీ తో  కిషన్ రెడ్డి సమావేశమయిన అనంతరం నిధులు విడుదలయ్యాయి.

వరదలు, భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు బాగా దెబ్బతిన్న సమయంలో ఈ నిధులు వస్తుండటం శుభపరిణామం. ఈ మొత్తాన్ని తెలంగాణ రోడ్డు భవనాల శాఖ (ఎన్‌హెచ్).. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ పనుల కోసం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో నిధులు త్వరగా విడుదలయ్యాయి. 

తెలంగాణ లో 8 జాతీయ రహదారుల (పొడవు 868 కి.మీ.) నిర్వహణ, మరమ్మత్తుల కోసం ₹ 202.00 కోట్ల  అంచనాలను ఎన్‌హెచ్ఏఐ ఆమోదించింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన మొత్తం నిధులు తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బి (ఎన్‌హెచ్) సమర్పించిన ప్రతిపాదనలకంటే 85% ఎక్కువ ఉండడం గమనార్హం.

వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు మరింత పాడవకుండా, కొత్త గుంతలు ఏర్పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వాహనాలు నడిపేందుకు వీలుగా రోడ్లను బాగుచేసేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు.

వరదలు, అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని పూరిస్తూ తెలంగాణ సర్కారు చేపట్టే మరమ్మత్తు, పునరావాస కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.