మేడిగడ్డ బ్యారేజ్ ఘటన.. సెఫ్టీపై ఆందోళన.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతభాగం శనివారం రాత్రి కుంగిపోయిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన కొంతభాగం శనివారం రాత్రి కుంగిపోయింది. నాణ్యత లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనను కేంద్ర జలశక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ.. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. అనంతరం మంగళవారం రోజున మేడిగడ్డ జలాశయాన్ని ఈ నిపుణుల కమిటీ సందర్శించనుంది. అనంతరం నివేదికను సిద్దం చేసి కేంద్ర జలశక్తి శాఖకు అందించనుంది.
ఇక, మేడిగడ్డ బ్యారేజీలో 20వ నెంబర్ పిల్లర్ అడుగు మేర కుంగిపోయిందని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. దాని ప్రభావంతో 20 నెంబరు పిల్లరుకు ఇరువైపులా బ్యారేజీ వంతెన కుంగిందని అన్నారు. పిల్లరు కుంగడానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, పూర్తి స్థాయి విచారణ తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.