హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హస్తినబాట పట్టారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా భేటీ కానున్నారు తమిళసై సౌందరరాజన్. 

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై సౌందర రాజన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత 11 రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా మధ్యాహ్నాం 12 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో తమిళసై సౌందరరాజన్ భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం జరిగిన పర్యవసానాలపై చర్చించనున్నారు. 

ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు. అలాగే మరోక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యయాత్నానికి పాల్పడ్డారు. ప్రజలు గమనించడంతో అతడిని ప్రాణాలతో కాపాడుకోగలిగారు. 

ఆకస్మాత్తుగా తెలంగాణ గవర్నర్ ఢిల్లీబాట పట్టడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందువల్లే ఢిల్లీ నుంచి గవర్నర్ కు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలతోనే సౌందరరాజన్ ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం.