Telangana: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ప్రణాళికాబద్ధంగా క్రాప్ క్లస్టర్లను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
Telangana: రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామనీ, అయితే, తెలంగాణకు కేంద్రం నుంచి సాయం అందడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులను సాయం చేయడంలోనూ కేంద్రం చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉందని తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు లాభదాయకమైన వృత్తిగా మార్చేందుకు దేశవ్యాప్తంగా క్రాప్ క్లస్టర్లను అభివృద్ధి చేసి, విస్తారమైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ప్రణాళికాబద్ధంగా క్రాప్ క్లస్టర్లను ప్రోత్సహించాలని కోరారు.
వ్యవసాయ, ఉద్యానవన పంటలు, నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధ్యయన పర్యటనలో భాగంగా మంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తోంది. అహ్మద్‌నగర్ జిల్లా షిర్డీ సమీపంలోని ద్రాక్ష, జామ తోటలను శుక్రవారం సందర్శించి స్థానిక రైతులతో పాటు అధికారులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో కేంద్రం రైతులను ఆదుకోవడం లేదని ఆరోపించారు. దానికి బదులు ఈ విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించకుండా రైతులకు నష్టం కలిగిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని బలంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. అలాగే రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీటి సరఫరా తదితరాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోందని వివరించారు.
ఫలితంగా గత ఏడెనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. దీనివల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న పంటల వైవిధ్య పద్ధతులను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రత్యేక బృందాలు ఇప్పటికే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా నాసిక్ జిల్లా ఏవ్లా తాలూకా అందర్ సూల్ గ్రామంలో రైతు నందకిశోర్ ఎండైత్ ఉల్లి సాగును పరిశీలించారు.
