విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీకి మూడు రోజులు సెలవులు ప్రకటింన ప్రభుత్వం.. తాజాగా క్యాంపస్‌లో సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు.
డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధులను అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే ట్రిపుల్ ఐటీకి మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అంతేకాదు.. క్యాంపస్‌లో సెల్‌ఫోన్ల వినియోగంపైనా అధికారులు నిషేధం విధించారు. తరగతి గదులు, అకడమిక్ బ్లాక్ లు, పరిపాలనా భవనాల్లో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయితే ఈ ఆదేశాలపై విద్యార్ధుల భగ్గుమన్నారు. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
ఇకపోతే.. బాసర ట్రిపుల్ ఐటీలో ( basara iiit) మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యార్ధులు. 12 డిమాండ్లు పరిష్కారం కాలేదని నిరసనలకు సిద్ధం పిలుపునిచ్చారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన మెస్‌లపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు విద్యార్ధులు. అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులకు ఇచ్చిన డెడ్ లైన్ శనివారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు ప్రభుత్వం మూడు రోజుల సెలవు ప్రకటించింది.
Also Read:ముగిసిన డెడ్‌లైన్.. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతోన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు
కాగా.. ఈ నెల 17న బాసర ట్రిపుల్ ఐటీలో ఇన్‌ఛార్జ్ వీసీతో విద్యార్ధుల చర్చలు నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమైన మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. మరికొన్ని డిమాండ్లను ఇన్‌ఛార్జ్ వీసీ ముందు వుంచారు విద్యార్ధులు. ఈ నెల 24 లోపు వీసీని నియమించాలని విద్యార్ధులు డెడ్ లైన్ పెట్టారు. లేనిపక్షంలో 25 నుంచి మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తాజాగా ఈ డెడ్‌లైన్ ముగియడంతో విద్యార్ధులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని గత నెలలో వారం రోజులు పాటు క్యాంపస్‌లోనే ఆందోళన చేసిన ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థులతో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు జరిపి.. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే తాజాగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో రెండు మెస్‌లలో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది.
