హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో తృటిలో పెను  ప్రమాదం తప్పింది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వార్డులో అనుకోకుండా ప్రమాదం సంభవించింది. తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి కింద పడిపోయింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

గాంధీ ఆస్పత్రి ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం పైన తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ హుక్‌ నుంచి ఊడి అమాంతం కిందపడింది. ఈ ఘటనలో బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇరువురు రోగులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. 

కరోనా పాజిటివ్‌ రావడంతో ఇప్పటికే మానసికంగా కుంగిపోయామని, ఈ హఠాత్పరిణామంతో మరింత భయాందోళనకు గురయ్యామని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి పాలన యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావును వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.