హైద్రాబాద్ మియాపూర్‌లో చెడ్డీగ్యాంగ్ కలకలం: స్కూల్లో రూ. 7.85 లక్షలు చోరీ
హైద్రాబాద్ మియాపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ప్రైవేట్ స్కూల్ లో చోరీ చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి చెడ్డీ గ్యాంగ్ కదలికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. హైద్రాబాద్ మియాపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చెడ్డీ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు చోరీకి పాల్పడ్డారు.
ముఖాలకు ముసుగులు ధరించి స్కూల్ లో నగదును దోచుకెళ్లారు. స్కూల్ కౌంటర్ లో ఉన్న రూ. 7 లక్షల 85 వేల నగదును చోరీ చేశారు. చెడ్డీ మాత్రమే ధరించిన ఇద్దరు స్కూల్లో నగదును దోచుకున్నారు. తమను గుర్తించకుండా ఉండేందుకు దుండగులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్కూల్ లోని సీసీకెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
నగర శివార్లలో గతంలో చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. నగరంలో పలు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఇటీవల కాలంలో లేవు. అయితే తాజాగా మియాపూర్ లోని ఘటనతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ స్కూల్ లో చోరీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
గతంలో కూడ చెడ్డీగ్యాంగ్ సభ్యులు నగరంలో పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. 2023 ఆగస్టు 11న హైద్రాబాద్ మియాపూర్ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు.గేటేడ్ కమ్యూనిటీ విల్లాలో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
2022 అక్టోబర్ మాసంలో షాద్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు.ఈ ప్రాంతంలోని నివాస ప్రాంతాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు రికార్డయ్యాయి.2023 ఆగస్టు మాసంలో నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండల కేంద్రంలో ఆదివారంనాడు ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగదు, బంగారం, పట్టు చీరెలను దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేశారు.