హైదరాబాద్:  సీబీఐలో అత్యున్నత అధికారుల  మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో   సానా సతీష్ బాబు పేరు  ప్రముఖంగా విన్పిస్తోంది. అసలు సానా సతీష్ బాబు ఎవరనే  చర్చ ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సతీష్ బాబు ప్రస్తుతం  హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సతీష్ బాబు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు.  పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన తర్వాత విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరారు.  ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన కొద్ది కాలానికే ఆ ఉద్యోగానికి  రాజీనామా ఇచ్చేశాడు.

హైద్రాబాద్‌కు  నివాసాన్ని మార్చేశాడు.  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. రాసామా ఎస్టేట్స్‌, గోల్డ్‌కోస్ట్‌ ప్రాపర్టీస్‌, మ్యాట్రిక్స్‌ నేచురల్‌ రిసోర్సెస్‌, తూర్పు గోదావరి బ్రూవరీస్‌ కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సతీష్ ఆయనతో సన్నిహితంగా ఉండేవాడని  ఆనాడు ప్రచారంలో ఉంది.

జగన్ అక్రమాస్తులో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్‌తో కూడ సతీష్‌కు  సంబంధాలు ఉన్నాయని  చెబుతుంటారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో  సతీష్‌కు సంబంధాలు ఉన్నాయని సీబీఐ గుర్తించింది. 

2015లో సతీష్‌ పేరును మొయిన్ ఖురేషీ కేసులో  సీబీఐ చేర్చింది. సీబీఐ  కేసుల్లో సతీష్ మధ్యవర్తిగా వ్యవహరించారనే ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. గతంలో హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యాపారిపై సీబీఐ కేసు నమోదు చేయిస్తే .... బెయిల్ ఇప్పించేందుకు  ప్రయత్నించారని ఆయనపై ఆరోపణలు కూడ అప్పట్లో వచ్చాయి.

ఎమ్మార్ కేసులో సతీష్ మధ్యవర్తిత్వం చేశారని చెబుతుంటారు. హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని  ఐఎస్‌బీ సమీపంలోని  హిల్‌రెడ్డిలో గల 72 నెంబర్ విల్లాలో  సతీష్ నివాసం ఉంటున్నారు.  ఈ ఇంటికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు  సార్ లేరని సమాధానం వస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ కూడ  మీడియాను అనుమతించడం లేదు.

 

సంబంధిత వార్తలు

సిబిఐలో అంతర్యుద్ధం: సిఎం రమేష్ పాత్ర ఏమిటి?

సీబీఐలో కుమ్ములాట: రంగంలోకి దిగిన ప్రధాని మోడీ

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్