తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపిన ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొటున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఇప్పటికే ఈ కేసులో నాటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారులతో పాటు రేవంత్ ముఖ్య అనుచరుడు ఉదయ్ సింహను అధికారులు విచారించారు. 2015లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్ తదితరులు లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి మనీలాండరింగ్‌ జరిగిందా అన్న కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల నగదుతో పాటు, ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తానన్న రూ.4.5 కోట్లు నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఈడీ.. రేవంత్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.