తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పీడ్ పెంచింది. విచారణలో ఏసీబీ అధికారుల్నే ఫాలో అయిన ఈడీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

గత వారం వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారులను ప్రశ్నించిన అధికారులు ..విచారణలో భాగంగా సోమవారం నాటి టీడీపీ నేత, ప్రస్తుత టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌సింహాను ఈడీ విచారించింది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించింది. గతంలో వారిచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు చెల్లించేందుకు రూ.50 లక్షల నగదు ఉన్న బ్యాగును ఉదయ్ సింహ తీసుకొచ్చినట్లు ఏసీబీ రికార్డు చేసిన వీడియోలో ఉంది.

దీని ఆధారంగా ఈడీ ఆయనను ప్రశ్నించింది. ఇందులో భాగంగా ఉదయ్ ‌పై పలు ప్రశ్నలను సంధించింది.. నగదు ఉన్న బ్యాగు ఎక్కడి నుంచి తెచ్చావు..? నీకు ఆ బ్యాగ్ ఎవరిచ్చారు, ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారు...?

బ్యాగులో రూ. 50 లక్షలు ఉన్న విషయం ముందుగా నీకు ఎలా తెలుసు..? ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్టిఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మరో రూ.4.5 కోట్ల విషయం ఏంటీ.?, రేవంత్, వేం నరేందర్ రెడ్డి, సెబాస్టియన్‌లతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది..? వంటి అంశాలపై ప్రశ్నించారు.

ఓటుకు నోటు కేసును విచారించిన ఏసీబీ అధికారుల కేసు స్టడీస్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తులో తేలిన అంశాలు, నాటి ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, అతని కుమారులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఉదయ్‌సింహను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఉదయ్ సింహ ఏ మాత్రం బెదరకుండా తనదైన శైలిలోనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. మరో వైపు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

విచారణ ముగిసన తర్వాత మీడియాతో మాట్లాడిన ఉదయ్ సింహ... గతంలో ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు అడిగిన ప్రశ్నల్నే ఈడీ ప్రశ్నించినట్లు తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐటీ సోదాలతో రేవంత్‌ను ఇబ్బంది పెట్టారని, తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈడీ పేరుతో పాత కేసులు తిరగదోడుతూ.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు.