హైదరాబాద్: ఓటుకు నోటుకు కేసులో  కాంగ్రెస్ పార్టీ నేత వేం నరేందర్ రెడ్డికి శుక్రవారం నాడు ఈడీ నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ గచ్చిబౌలిలోని రోలింగ్‌ హిల్స్‌లో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.  వారం రోజుల్లో తమ ముందు హాజరు కావాలని  ఆదేశాలు జారీ చేశారు.

2015 మే 30 వ తేదీన ఓటుకు నోటు కేసు  నమోదైంది. ఆ సమయంలో తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు గాను  అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌‌ను ప్రలోభపెడుతూ దొరికారు. 

ఈ కేసు  అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఈ కేసును నమోదు చేశారని రేవంత్ రెడ్డి  ఆరోపించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల్లో  రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు టీడీపీ నుండి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.