హైదరాబాద్: ఓటుకు నోటు కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ తన కౌంటర్ లో సంచలన విషయాలను బయటపెట్టింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును కోర్టు ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహ, తమ పేర్లు తొలగించాలంటూ డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో పలు సంచలన విషయాలను పొందుపరిచింది. 

తనను అనవసరంగా కేసులో ఇరికించారని సండ్ర వెంకటవీరయ్య చేసిన వాదనల్లో నిజం లేదని ఏసీబీ స్పష్టం చేసిది. 2015లో హైదరాబాదులోని గండిపేటలో జరిగిన మహానాడులో నిందితులు కుట్ర పన్నారని, స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి పథక రచన చేశారని చెప్పింది. 

ప్రస్తుత కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డితో, ఇతర నిందితులతో కలిసి సండ్ర వెంకటవీరయ్య కుట్ర చేశారని తెలిపింది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో సండ్ర వెంకటవీరయ్యతో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ చర్చలు జరిపారని, వారిద్దరితో జరిపిన ఫోన్ కాల్స్ సండ్ర వెంకట వీరయ్య ప్రమేయాన్ని బయటపెట్టాయని, అందుకే ఆయనను అరెస్టు చేశామని ఏసీబీ వివరించింది.

రేవంత్ రెడ్డి అనచరుడు ఉదయసింహకు కూడా ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉందని, నాగోలు వద్దకు రావాలని ఉదయసింహకు రేవంత్ రెడ్డి చెప్పారని, వేం కృష్ణ కీర్తన్ రెడ్డి నుంచి ఉదయసింహ రూ.50 లక్షలు తీసుకొచ్చారని, ఓటుకు నోటు కేసును రుజువు చేసేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అందువల్ల సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహల డిశ్చార్జీ పిటిషన్ ను కొట్టేయాలని ఏసీబీ కోర్టును కోరింది.  

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30వ తేదీన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.