హైదరాబాద్: రాత్రి రూ.6లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆ యజమాని. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే నిద్రపోయాడు. తెల్లవారేసరికి చెత్తవాడు విజిల్స్ వేశారు. ఇంట్లోని అతని కుటుంబ సభ్యులు నగదు బ్యాగ్ ను చెత్త బ్యాగ్ అనుకుని వాచ్ మెన్ కు ఇచ్చారు. వాచ్ మెన్ తీసుకెళ్లి ఆ నగదు బ్యాగ్ ను చెత్తకార్మికుడికి ఇచ్చాడు. 

నిద్రలేచిన ఆ ఇంటియజమానికి తాను రూ.6లక్షలు తెచ్చానన్న విషయం గుర్తుకు వచ్చింది. వెళ్లి చూసేసరికి నగదు బ్యాగ్ కనిపించలేదు. కుటుంబ సభ్యులను బ్యాగ్ గురించి ఆరా తీస్తే చెత్త అనుకుని వాచ్ మెన్ కు ఇచ్చానని బదులిచ్చింది. దీంతో తలపట్టుకున్న ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ లోని రాధాకృష్ణానగర్ లో చోటు చేసుకుంది. 

కాలనీకి చెందిన ఓ అపార్టమెంట్ లో ఓ యజమాని గురువారం సాయంత్రం ఆరు లక్షల నగదును ప్లాస్టిక్ కవర్ లో తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. శుక్రవారం ఉదయం చెత్తకోసం వచ్చిన కార్మికుడికి ఇంట్లోని వారు ఆబ్యాగును చెత్త బ్యాగ్ అనుకుని వాచ్ మెన్ కు అందజేశారు. వాచ్ మెన్ ఆ బ్యాగ్ ను చెత్త తీసుకువెళ్లే యాదగిరికి చెందిన వాహనంలో పడేశారు. 

మద్యాహ్నం 12 గంటలకు నగదు తీసుకువచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించకపోవడంతో ఇంట్లో వెతకగా నగదు బ్యాగ్ కు బదులు చెత్త బ్యాగ్  కనిపించింది. కుటుంబ సభ్యులను నిలదీయగా  అసలు విషయం చెప్పారు. దీంతో ఆ యజమాని రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. 

పోలీసులు చెత్త సేకరించే యాదగిరిని అదుపులోకి తీసుకుని విచారించారు. యాదగిరి చెత్తను పారేసిన డంపింగ్‌ యార్డు వద్దకు తీసుకెళ్లి చెక్ చేశారు. ఆటోతో పాటు అప్పుడే చెత్తను తరలిస్తున్న లారీని కూడా పూర్తిగా వెతికారు. అయినా డబ్బు బ్యాగ్‌ కనిపించలేదు. దీంతో యాదగిరితో పాటు వాన్‌మెన్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారిస్తున్నారు. 
 
చెత్తను సేకరించే కార్మికుడిపై నేరారోపణ చేస్తూ పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో రాత్రి వరకు ఉంచడంతో బీఎల్ ఎఫ్ నాయకులు అక్కడకు చేరుకున్నారు. యాదగిరి అరెస్ట్ ను ఖండించారు. రూ. 6 లక్షల డబ్బును ఎవరైనా చెత్త వేసే ప్రాంతంలో భద్రపరుస్తారా అని ప్రశ్నించారు. కార్మికుడిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.