ఖమ్మం  జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ  ఎమ్మెల్యే మదన్‌లాల్  బానోత్  కొడుకు మృగేందర్  లాల్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది. ఓ యువతి  ఫిర్యాదు  మేరకు పోలీసులు ఈ కేసు నమోదు  చేశారు. 

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ బానోత్ కొడుకు మృగేందర్ లాల్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. యువతి తన ఫిర్యాదులో మృగేందర్.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని పేర్కొంది. పెళ్లి గురించి ప్రస్తావిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. యువతి తెలిపిన వివరాలు ప్రకారం.. కొన్నేళ్ల క్రితం మృగేందర్ లాల్‌కు మూసాపేటలో నివాసం ఉండే యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయింది. కొన్ని రోజులకు వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని మృగేందర్ లాల్ పలు సందర్బాల్లో చెప్పాడు. 

ఐపీఎస్‌కు ఎంపికైన మృగేందర్‌ శివరాంపల్లిలోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకోవడం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలోనే 2019 డిసెంబర్ 25న సదరు యువతిని బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ప్లాన్ ప్రకారం.. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీసు అకాడమీలో తన గదికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కోపంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. 


ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి సారీ చెప్పాడు. కొద్దిరోజుల అనంతరం తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని, అకాడమీకి రావాలని చెప్పడంతో ఆ యువతి నమ్మి వెళ్లింది. అక్కడ తన కోరికను తీర్చకపోతే వివాహం చేసుకోనని బ్లాక్‌మెయిల్‌ చేయడంతో వేరే మార్గం లేక ఆ యువతి అంగీకరించింది. ఇది జరిగిన తర్వాత మృగేందర్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ముఖం చాటేసేవాడు. పలు కారణాలు చెప్పి ఆమె నుంచి తప్పించుకునేవాడు. 

అయితే గతేడాది ఆగస్టులో మృగేందర్ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎస్‌కు రాజీనామా చేసి ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అకాడమీలో చేరాడు. అక్కడ మృగేందర్‌కు మరొక అమ్మాయితో దగ్గరి సంబంధం ఉందని ఆ యువతి నిలదీయడంతో మృగేందర్‌ తండ్రి Banoth Madan Lal యువతికి రూ.25 లక్షల నగదు ఇస్తానని ఆశ చూపించాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో.. కుటుంబ సభ్యుల ముందే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె తనకు న్యాయం చేయాలని కూకట్‌పల్లి పోలీసులను ఆశ్రయించింది. ఇక, మృగేందర్ ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు.