ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో శేరిలింగం పల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ మెతుకు నర్సింహ రాములుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలపై నిర్వహించిన తనిఖీల్లో రూ.40 కోట్లకు పైగా అక్రమాస్తులు వున్నట్లు తేలింది.  

శేరిలింగంపల్లి (serilingampally) సిటీ ప్లానర్ రాములుపై ఏసీబీ (acb) కేసు నమోదు చేసింది. రాములుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును నమోదు చేశారు. 20 చోట్ల ఆస్తులు, రెండున్నర కిలోల బంగారాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీస్‌లో పెద్ద మొత్తంలో అక్రమాలు పాల్పడినట్లుగా గుర్తించారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.40 కోట్ల పైచిలుకు ఆస్తులు వున్నట్లు తేలింది. గురువారం ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల రాములు నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

టౌన్‌ ప్లానింగ్‌ (town planning) అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ ఫిర్యాదులు అందడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టింది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.