తెలంగాణ ఉద్యమకారులపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ ఉద్యమాన్ని తాగుబోతులు నడిపారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరించినవారు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

బంజారాహిల్స్ లోని పవన్ కల్యాణ్ ఇంటి ముందు, జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. ఒక్కసారి మద్యంపై నిషేధం విధించిన తర్వాత ఉద్యమం ఆగిపోయిందని పవన్ కల్యాణ్ అన్నట్లు ఆరోపిస్తున్నారు. 

దోపిడీ వ్యవస్థలు ఎక్కడున్నా సరే, తెలంగాణలో ఉన్నా ఆంధ్రలో ఉన్నా మనం వ్యతిరేకించాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు. తన చేతుల్లో తెలంగాణ ఉద్యమం ఉండి ఉంటే ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపించి ఉండేవాడినని ఆయన వ్యాక్యానించారు. 

దురదృష్టవశాత్తు తాను తెలంగాణలో పుట్టలేదని, అయితే కరీంనగర్ లో పునర్జన్మ ఎత్తినవాడినని ఆయన అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ప్రత్యేక పరిస్థితుల వల్ల కావచ్చు లేదా కేసీఆర్ ప్రత్యేక ఆలోచన వల్ల కావచ్చు అది జరగలేదని, తాను దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు.