టాలీవుడ్‌ స్టార్ యాంకర్‌, సినీ నటి శ్రీముఖిపై కేసు నమోదైంది. ఓ టీవీలో చేసిన వ్యాఖ్యల కారణంగా బంజార హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శ్రీముఖి మీద కేసు నమోదు చేశారు. నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ ప్రముఖ చానల్‌ రియాలిటీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు గాను శర్మ అనే వ్యక్తి కంప్లయింట్ ఇచ్చారు.


ఆయన ఫిర్యాదు మేరకు శ్రీముఖితో పాటు సదురు కార్యక్రమ నిర్వాహకులు, ఛానల్ మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన జులాయి సినిమాతో వెండితెరకు పరిచయమైన శ్రీముఖి తరువాత బుల్లితెర మీద యాంకర్‌గా సత్తా చాటింది. స్మాల్‌ స్క్రీన్‌ రాములమ్మగా పాపులర్‌ అయిన ఈ బ్యూటీ, ఇటీవల బిగ్‌ బాస్‌ షోలోనూ పాల్గొంది. ఈ షోస్‌ చివరకు వరకు నిలిచి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.