లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: భద్రాచలం ఎమ్మెల్యే సహా 25 మందిపై కేసు
భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యపై బుధవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు 25 మందిపై కేసు నమోదు చేశారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోని జగదీష్ కాలనీలో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీరయ్య బుధవారం నాడు ప్రారంభించారు.
ఈ విషయం తెలుసుకొన్న మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొన్నారు. నిత్యావసర సరుకులు తీసుకొనే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. గుంపులు గుంపులుగా జనం తోసుకొంటూ నిత్యావసర సరుకుల కోసం ఎగబడ్డారు..
మహిళలను అదుపు చేసే పరిస్థితి లేకుండాపోయింది. చేసేదిలేక ఎమ్మెల్యే వీరయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆయన అనుచరులు నిత్యావసర సరుకులను పంపిణీచేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలను ఇళ్లకు పంపించివేశారు.
also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెల 19న తెలంగాణ కేబినెట్, లాక్‌డౌన్ సడలింపుపై చర్చ
లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఎమ్వెల్యే వీరయ్యతో పాటు ఆయన అనుచరులు 25 మందిపై కేసు నమోదు చేసినట్టుగా భద్రాచలం సీఐ బి.వినోద్ రెడ్డి తెలిపారు.