గద్వాల్ జిల్లాలో శనివారం ఉదయం కలుగొట్ల వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతయిన సింధూజ రెడ్డి ఆచూకీ 36 గంటల గడిచినా ఇంకా లభించలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది.

ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన  చెక్‌పోస్ట్ వద్ద పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిలో భాగంగా వారి కారును జాతీయ రహదారి నుంచి గ్రామాల మీదగా మళ్లించారు.

తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవల్లి మండలం పుల్లూరు నుంచి  కలుగొట్ల మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటం.. పైగా చిమ్మ చీకటి కావడంతో కలుగోట్ల వాగులో ప్రవాహాన్ని అంచనా వేయలేక వేగంగా వాగును దాటించే ప్రయత్నం చేశారు.

అప్పటికే వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శివకుమార్ రెడ్డి, అతని స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడగా.. శివకుమార్ రెడ్డి భార్య సింధూజ గల్లంతయ్యారు. దీంతో శనివారం నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

నిన్న రాత్రి ఏడు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా సింధూజ ఆచూకీ లభించలేదు. దీంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు సింధూజ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.