రోడ్డు మీద సైడ్ ఇవ్వమని అడిగినందుకు.. వేలు కొరికేశాడు. ఎలా కొరికాడంటే.. వేలు తెగి కింద పడిపోయింది. ఈ దారుణ సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మౌలాలి హనుమాన్ నగర్ కు చెందిన మహ్మద్ జాఫర్ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన అతను బైక్ పై  లాలా పేట వెళ్తున్నాడు. కాగా.. ఈ క్రమంలో మౌలాలి కమాన్ వద్ద ఎదురుగా ఇండికా కారు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు కొద్దిగా పక్కకు తీస్తే తాను వెళ్లిపోతానని జాఫర్ ఆ కారు డ్రైవర్ ని కోరాడు.

ఆ మాత్రం దానికే కోపంతో ఉగిపోయిన కారు డ్రైవర్.. జాపర్ ఉంగరపు వేలిని కొరికేశాడు. దీంతో అతని వేలు తెగి కిందపడిపోయింది. వెంటనే ఆ వేలితో సహా జాఫర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందాడు. సోమవారం ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహ్మద్ ఆలిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.