ఈటల రాజేందర్ తమ అసైన్డ్ భూమల వ్యవహారంపై టీఆర్ఎస్ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్పందించారు. ఈటల రాజేందర్ అసైన్డ్ ల్యాండ్ కొన్నట్లు అక్కడి ప్రజలు కేసీఆర్ ‌కు తెలిపారని ఆయన గుర్తుచేశారు.

ఇలాంటి విషయాల్లో త్వరగా స్పందించాల్సిన అవసరం వుందని లక్ష్మీకాంతరావు అభిప్రాయపడ్డారు. అభియోగాలు వచ్చినప్పుడు విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని ఆయన స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. 

వాస్తవానికి హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి అప్పటికే కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నియోజకవర్గంలో అప్పటికే మంచి పట్టుంది. అటువంటి కెప్టెన్‌ కుటుంబాన్ని పక్కనే ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గానికి పంపించి.. హుజూరాబాద్‌లో ఈటలకు టికెట్‌ ఇచ్చి గెలిపించారు కేసీఆర్.

Also Read:సరైన సమయంలో నా నిర్ణయం ప్రకటిస్తా: ఈటల రాజేందర్

పార్టీ ఆవిర్భావం నుంచి ఉండటమే కాదు, అన్ని రకాలుగా వెన్నుదన్నులా నిలిచిన కెప్టెన్‌ కుటుంబాన్ని కూడా ఈటల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క నియోజకవర్గానికి పంపిన సంగతి తెలిసిందే.

కాగా, మాసాయిపేట భూ కబ్జా ఆరోపణలపై జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.