ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో తెలియజేసే ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భానుడి భగభగలకు మంటలు చెలరేగి కేబుల్ వైర్లు కాలిపోయాయి.
హైదరాబాద్: రోహిణి కార్తె ఎండలకు రోకళ్లు సైతం పగిలిపోతాయని అంటుంటారు. కానీ ఈసారి రోహిణి కార్తెకు మరో నెలరోజుల సమయమున్న ఎండలు మాత్రం అదేస్థాయిలో మండిపోతున్నారు. ఈ మండుటెండలకు భయపడి ప్రజలు మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో అయితే వేసవి తాపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎండ వేడిమికి కేబుల్ వైర్లు సైతం కాలిపోతున్నాయంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ కు గజిబిజీగా చుట్టేసి ఉన్న నెట్ వర్క్ కేబుల్స్ కు మంటలు చెలరేగాయి. ఎండవేడికి పోల్ హీటెక్కి కేబుల్ వైర్లకు మంటలు అంటుుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా రోడ్డుపక్కన పోల్ పై మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికులు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసారు.
