రాత్రి సమయంలో తన క్యాబ్ లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్ దాడికి పాల్పడిన సంఘటన నాచారం ప్రాంతంలో చోటుచేసుకుంది. అంతేకాకుండా మహిళ వద్ద నుండి సెల్ ఫోన్, డబ్బులు లాక్కున్న డ్రైవర్ ఆమెను నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. అయితే బాధితురాలి పిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిల్ల సువర్ణ దేవి అనే మహిళ బోడుప్పల్ లో నివాసముంటుంది. ఆమెకు ఒంట్లో  బాగోలేకపోవడంతో ముషిరాబాద్ లోని కేర్ హాస్పిటల్ వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకుని రాత్రి 8 గంటల సమయంలో తిరిగి బోడుప్పల్ కు ఓ షేరింగ్ క్యాబ్ లో  బయలుదేరింది. 

సువర్ణ ఎక్కిన క్యాబ్ లో మరో మహిళ కూడా ఉంది. క్యాబ్ డ్రైవర్ ముందుగా సువర్ణతో పాటు ప్రయాణిస్తున్న మహిళను లాలాపేటలో వదిలిపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుండి బోడుప్పల్ కు వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో సువర్ణ ఒంటరిగా ఉండటాన్ని అదుపుగా తీసుకున్న డ్రైవర్ కారును దారిమళ్లించాడు.  బోడుప్పల్ వైపు కాకుండా వేరే దారిలోకి కారు పోనిచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన సువర్ణ  డ్రైవర్ ను ఈ విషయంపై ప్రశ్నించింది. దీంతో అతడు నాచారం క్రాస్ రోడ్ వద్ద కారును ఆపి బాధితురాలిని దుర్భాషలాడుతూ కొట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఆమె వద్ద గల పర్స్, ఫోన్ ను లాక్కుని రోడ్డుపక్కకు తోసేసి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ క్యాబ్ డ్రైవర్ కోసం గాలించిన పోలీసులు ఇవాళ అతడ్ని పట్టుకున్నారు. మహిళపై దాడిచేసిన క్యాబ్ డ్రైవర్ దుంబల శ్రీనివాస్ రెడ్డి(38) గా పోలీసులు గుర్తించారు. బాధితురాలి వద్దనుండి అతడు తస్కరించిన మైక్రోమ్యాక్స్ ఫోన్, 2300 నగదుతో పాటు ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.