వారం రోజులుగా కురుస్తున్న వానకు భూమి నానడంతో సెల్లార్‌తోపాటు మొదటి అంతస్తు భూమిలోకి కుంగిపోయింది.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పట్టణంలోని ఖాజీపేటలో ఓ భవనం భూమిలోని కుంగిపోయింది. విశ్రాంత ఉద్యోగి రవీందర్ రెడ్డి డీజీల్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానకు భూమి నానడంతో సెల్లార్‌తోపాటు మొదటి అంతస్తు భూమిలోకి కుంగిపోయింది.
విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుంగిన భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారందరిని ఖాళీ చేయించారు. భవనానికి కాపలాదారుడుగా ఉన్న బిక్షపతి ఆచూకి దొరకడంలేదు. విషయం తెలుసుకున్న అతని భార్య మణెమ్మ, ఇద్దరు పిల్లలు బిక్షపతి ఆచూకి కోసం వెతుకుతున్నారు. వాచ్‌మెన్ బిక్షపతి అందులోనే ఇరుక్కుని ఉన్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు.