అతివేగం, నిర్లక్ష్యం ఓ విద్యార్ధిని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ న్యూనాగోల్‌ కాలనీకి చెందిన సతనపల్లి రామబ్రహ్మం, కల్పనల కుమార్తె నవ్యశ్రీ తట్టి అన్నారం శ్రేయా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది

అతివేగం, నిర్లక్ష్యం ఓ విద్యార్ధిని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ న్యూనాగోల్‌ కాలనీకి చెందిన సతనపల్లి రామబ్రహ్మం, కల్పనల కుమార్తె నవ్యశ్రీ తట్టి అన్నారం శ్రేయా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది.

ఆదివారం చిన్న పని నిమిత్తం అదే కాలేజీలో చదువుకుంటున్న స్నేహితురాలు సాతనతో కలిసి యాక్టివాపై కళాశాల వద్దకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో బండ్లగూడ ఆర్టీసీ డిపో దాకా వచ్చాకా ఆదివారం కాలేజీలో ఎవరూ ఉండే అవకాశం లేదనే ఉద్దేశ్యంతో తిరిగి పయనమయ్యారు.

సాధన బైక్ నడుపుతుండగా నవ్యశ్రీ వెనుక వైపు కూర్చోంది. బండ్లగూడ, ఆనంద్ నగర్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప సముదాయాల వద్దకు రాగానే తట్టి అన్నారం వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నవ్యశ్రీ ఎగిరి లారీ కింద పడటంతో వెనుక చక్రాలు ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడ దుర్మరణం పాలవ్వగా, సాధన లారీకి ఎడమవైపు పడటంతో స్వల్ప గాయాలతో బయటపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కూతురు ప్రమాదంలో మరణించడంతో నవ్యశ్రీ తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.