తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టుగా చెప్పారు. కాగజ్‌నగర్ టౌన్‌లోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సిర్పూర్ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆయన అనుచరుల మద్దతుతో కాంట్రాక్టర్లు, దోపిడీదారులు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన సిర్పూర్‌లో ఇంకా ఆంధ్ర పాలనే కొనసాగుతుందని విమర్శలు చేశారు.
కాగజ్‌నగర్ (సిర్పూర్) పేపర్ మిల్లు యాజమాన్యం ఎమ్మెల్యేతో కుమ్మక్కయి ఉద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. స్థానిక ఉద్యోగులకు తక్కువ జీతాలు చెల్లిస్తుండగా.. పక్క రాష్ట్రానికి చెందిన వారికి యాజమాన్యం మెరుగైన జీతాలు చెల్లిస్తోందని ఆరోపణలు చేశారు. అందవెల్లి వంతెన సమస్యను ప్రస్తావిస్తూ.. అధికారులు బిల్లులు క్లియర్ చేస్తున్నా పనులు మాత్రం జరగడం లేదన్నారు. పనులు ప్రారంభించక ముందే అంధవెల్లి వంతెన కూలిపోయింది.
సిర్పూర్ ప్రాంత ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో నోటిఫై చేసిన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితుల బందుతో సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజలకు అందడం లేదని విమర్శించారు.
ఇక్కడి ఎమ్మెల్యే పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతోనే తాను సిర్పూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇక్కడి ప్రజలు చాలామంది తనను కోరారని.. బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించిన తర్వాత ఆమె ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
