Asianet News TeluguAsianet News Telugu

చిన్న చిన్న అసంతృప్తులు .. పక్కనబెట్టండి, బీఆర్ఎస్‌ను గెలిపించండి : ఓటర్లకు కేటీఆర్ విజ్ఞప్తి

చిన్న చిన్న అసంతృప్తులు వున్నా బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.  తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

brs working president ktr road show at kothagudem and yellandu ksp
Author
First Published Nov 19, 2023, 6:58 PM IST

చిన్న చిన్న అసంతృప్తులు వున్నా బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భద్రాచలం, ఇల్లెందులలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశమిస్తే.. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే 24 గంటల విద్యుత్ ఇచ్చామని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని కేటీఆర్ జోస్యం చెప్పారు. 

భద్రాచలం వచ్చినప్పుడు రాములవారి దర్శనానికి వెళ్దామనుకున్నానని.. కానీ అధికారుల సూచన మరకు విరమించుకున్నట్లుగా మంత్రి తెలిపారు. త్వరలోనే మరోసారి రామయ్య దర్శనానికి వస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. భద్రాచలం ప్రజలు బీఆర్ఎస్‌కు ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదని.. ఈసారి ఈ నియోజకవర్గాన్ని గులాబీ వనంలోకి చేర్చాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వరద ముంపు నుంచి పట్టణానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని.. యాదాద్రి కంటే గొప్పగా , భద్రాలచం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కొందరు డబ్బు సంచులతో వస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

Also Read: ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే, కాంగ్రెస్ బాగా పాలిస్తే .. ఎన్టీఆర్ టీడీపీ పెట్టేవారా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంతకుముందు నాగర్ కర్నూల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ ..  50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని.. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ దుయ్యబట్టారు. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రతో కలిపి ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. ఆంధ్రలో కలపడం వల్ల 60 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డామని.. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మళ్లీ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. పక్కనే ఉన్నప్పటికీ మహబూబ్‌నగర్  ప్రజలు కృష్ణా జలాలకు నోచుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్ధిక నిపుణులతో చర్చించి సంక్షేమ పథకాలు రూపొందించామని కేసీఆర్ వివరించారు. రూ.200 ఉన్న పింఛన్లను రూ.2 వేలకు పెంచామని సీఎం గుర్తుచేశారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ ఉండలేదని .. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని కేసీఆర్ గుర్తుచేశారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని.. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి వుండేదని సీఎం ప్రశ్నించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios