నల్గొండ జిల్లాలోని  శాలిగౌరారం మండలం  ఇటుకలపాడు గ్రామంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.   రోడ్లు బాగా లేవని  వ్యాఖ్యానించిన  కోమటిరెడ్డిపై  బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. 

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కుర్చీలు, కర్రలు విసిరారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటుకులపాడు గ్రామంలో గురువారం నాడు జరిగిన కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు.

ఈ గ్రామానికి రావడానికి మూడు కి.మీ దూరానికి గంటల సమయం పట్టిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ అధోగతి కి గురి చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. అంతేకాదు బీఆర్ఎస్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ గా తీసుకున్నారు. రోడ్ల దుస్థితితో పాటు కేసీఆర్ పై విమర్శలు చేయడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కుర్చీలు, కర్రలతో దాడికి యత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడికి దిగారు.వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు . ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సురక్షితంగా అక్కడికి పంపించారు.