తెలంగాణ ఎన్నికలు: టార్గెట్ రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రచార అస్త్రం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల దాడులు కొనసాగుతున్నాయి. అయితే అధికార బీఆర్ఎస్ ప్రచారంలో ప్రత్యర్థి పార్టీల కంటే ముందజలో కొనసాగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన దాదాపు జరిగిపోవడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సభలతో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల వర్షం కురిపిస్తుంది. అయితే కాంగ్రెస్‌పై విమర్శలు చేసే సమయంలో బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా రాహుల్ గాంధీ ఫ్యామిలీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్‌పై చేస్తున్న విమర్శల్లో ఎక్కువగా రేవంత్ రెడ్డిపైనే ఉంటున్నాయి.
కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పదే పదే రేవంత్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా రేవంత్ టార్గెట్‌గా బీఆర్ఎస్ మద్దతుదారులు పోస్టులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించడంతో పాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటాడనే విమర్శలు చేస్తున్నారు.
గతంలో రేవంత్ రెడ్డి ఓటు నోటుకు కేసులో అడ్డంగా దొరికిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. నోటుకు నగదు కేసులో పట్టుబడిన దొంగ చేతిలో కాంగ్రెస్ ఉందని కేటీఆర్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే రేవంత్ పనిచేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.