బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల
బీఆర్ఎస్‌ను వీడుతున్నట్టుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు.
నాగర్ కర్నూల్: బీఆర్ఎస్ ను వీడుతున్నట్టుగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి ప్రకటించారు. విలువలు లేని చోట ఉండలేనని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆదివారంనాడు పాల్గొన్నారు. త్వరలోనే దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడ దామోదర్ రెడ్డి రాజీనామా చేయనున్నారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మర్రి జనార్ధన్ రెడ్డి సహకరించలేదని దామోదర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుండి దామోదర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి మధ్య అంతరం కొనసాగుతుంది. ఈ ఏడాది జూన్ 10వ తేదీన కాంగ్రెస్ నేత మల్లు రవితో కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి ముందే నియోజకవర్గ వ్యాప్తంగా తన అనుచరులుతో దామోదర్ రెడ్డి తనయుడు సమావేశాలు నిర్వహించారు. పార్టీని వీడే విషయమై అనుచరులతో చర్చించారు. అయితే జూన్ మాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన సీఎం కేసీఆర్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై దామోదర్ రెడ్డి వెనక్కు తగ్గారా అనే ప్రచారం సాగింది.
అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ లో చేరడానికి ముందు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులతో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి తనయుడు రాకేష్ ను బరిలోకి దింపాలని కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భావిస్తున్నారు.ఈ విషయమై దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో చర్చలు జరిపినట్టుగా సమాచారం.
also read:బీఆర్ఎస్‌కు షాకివ్వనున్న కూచుకుళ్ల: కాంగ్రెస్ లో చేరనున్న ఎమ్మెల్సీ
ఇదిలా ఉంటే దామోదర్ రెడ్డికి గతంలో ప్రత్యర్ధిగా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి కూడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నాగర్ కర్నూల్ నుండి పలు దఫాలు నాగం జనార్థన్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఒక్క దఫా ఇండిపెండెంట్ గా గెలిచారు. ఈ దఫా నాగం జనార్థన్ రెడ్డి కూడ కాంగ్రెస్ టిక్కెట్టుపై నాగర్ కర్నూల్ నుండి పోటీకి ప్రయత్నాలు ప్రారంభించారు.