బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు.. బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది.

కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. శంకరపట్నం మండలం తాడికల్ శివారులో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అయితే కారులోని ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనలో కౌశిక్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో వాహనంలో కౌశిక్ రెడ్డి హుజురాబాద్‌కు వెళ్లారు. ఇక, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగే 2కే రన్‌లో పాల్గొనేందుకు కరీంనగర్ వైపు నుంచి హుజురాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.