ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణ వివరాలను కేసీఆర్‌కు వివరిస్తోన్న కవిత
ప్రగతి భవన్‌లో తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం వివరాలను ఆయనకు కవిత వివరిస్తున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గత మూడు రోజులుగా ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఈడీ విచారణకు సంబంధించిన వివరాలను కవిత తన తండ్రి కేసీఆర్‌కు వివరిస్తున్నారు.
అంతకుముందు లిక్కర్ స్కాంకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మంగళవారం దాదాపు పది గంటల పాటు ఆమెను ఈడీ అధికారులు విచారించారు. అయితే సాయంత్రం ఈడీ ఆఫీస్ నుంచి కవిత న్యాయవాది సోమా భరత్‌కు పిలుపు రావడంతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా వున్నారు. ఈ సందర్భంగా ఈడీ అడిగిన సమాచారాన్ని సోమా భరత్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.
ALso REad: ఢిల్లీ లిక్కర్ స్కాం .. ముగిసిన కవిత ఈడీ విచారణ, సెల్‌ఫోన్‌లపైనే ప్రశ్నల వర్షం
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈడీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అనంతరం రాత్రి 9.44 గంటలకు కవిత ఈడీ కార్యాలయంలోని గేట్ నెం 3 నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలకు, మీడియాకు అభివాదం చేస్తూ కారులో ముందుకు సాగారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కవిత ఈడీ ఆఫీసుకు విచారణ కోసం వచ్చారు. ఈ రోజు ప్రధానంగా మొబైల్ ఫోన్లపై ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు మరోసారి విచారించారు. తొలుత ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. సోమవారం దాదాపు 10 గంటలకు పైగా ఆమెను ప్రశ్నించారు. మరోవైపు.. ఈడీకి మంగళవారంనాడు కవిత లేఖ రాశారు. తనను రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆ లేఖలో కవిత ఆరోపించారు. గతంలో తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి అందిస్తున్నానని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానని తప్పుడు ప్రచారం చేశారని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారని ఆమె ప్రశ్నించారు.