మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి ఇన్నాళ్లు సిగ్గుపడే పరిస్ధితులు వున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. తనకు అవకాశం వస్తే.. అలాంటి పరిస్ధితి తీసుకురానని కడియం చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన ప్రసంగిస్తూ.. చెడు ప్రవర్తనతో తాను ఏనాడూ కార్యకర్తలకు , ప్రజలకు తలవొంపులు తెచ్చే పరిస్ధితి తీసుకురాలేదన్నారు. మీ అందరినీ చూస్తుంటే సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని కడియం పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని.. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించానే కానీ తప్పుడు పనులు చేయలేదన్నారు.
ప్రజలు , కార్యకర్తలు పెట్టిన భిక్ష వల్లే తాను ఈ స్థాయిలో వున్నానని శ్రీహరి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మార్పులు చేర్పులకు అవకాశం వుండే అవకాశం వుందని.. ఒకవేళ తనకు అవకాశం వస్తే మీ అందరి ఆశీస్సులు అందించాలని కడియం అభ్యర్ధించారు. మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికి ఇన్నాళ్లు సిగ్గుపడే పరిస్ధితులు వున్నాయన్నారు . తనకు అవకాశం వస్తే.. అలాంటి పరిస్ధితి తీసుకురానని కడియం శ్రీహరి చెప్పారు.
Also Read: అన్నీ విషయాలు చెప్పా: కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్నారు. ఇటీవల కేటీఆర్‌ను కలిసిన రాజయ్య.. కడియంపై ఫిర్యాదు చేశారు.
