దొంగలే కాంగ్రెస్ లోకి పోతారంటివి... కేసీఆర్ తోనే వుంటానంటివి... ఇంతలోనే ఏమయ్యింది పోచారం..!
రోజురోజుకు భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. చిన్నాచితకా నాయకులు కాదు ఏకంగా కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన నాయకులుసైతం ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి అదే బాటలో నడిచారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ మాజీ స్పీకర్, బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కొడుకు భాస్కర్ రెడ్డితో కలిసి పోచారం కాంగ్రెస్ లో చేరారు.
సీనియర్ నేత పోచారం పార్టీని వీడటంతో భారత రాష్ట్ర సమితిలో అలజడి రేగింది. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం కల్పించిన పార్టీని కష్టకాలంలో విడిచివెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బిఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులు పోచారం ఇంటివద్ద ఆందోళన చేపట్టారు. పోచారం ఇంట్లోకి చొచ్చుకెళ్లడమే కాకుండా సీఎం రేవంత్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నంచేసిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు.
కాంగ్రెస్ లోకి పోచారం అందుకోసమేనా..?
పోచారం శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ మాత్రమే కాదు అధినేత కేసీఆర్ కు సన్నిహితుడు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా, ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఎదురుగాలి వీచినా బాన్సువాడ నుండి పోటీచేసిన పోచారం గెలిచారు.
అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కాస్త బలహీనంగా వున్నవిషయం తెలిసిందే. దీంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసమే స్వయంగా రంగంలోకి దిగిన సీఎం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. ఇలా ఏం హామీ ఇచ్చారోగాని అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమితర్వాత కూడా కేసీఆర్ వెంటే వుంటానన్న పోచారం సడన్ గా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను చూస్తే ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని... పెద్దలుగా అండగా నిలబడాలని కోరినట్లు సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని... వ్యవసాయ రంగంలో మంచి అనుభవం వున్న ఆయన సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళతామన్నారు. భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. ఇలా పోచారం అనుభవాన్ని ఉపయోగించుకుంటాం... సముచిత స్థానం కల్పిస్తామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఏమయినా అవకాశం ఇస్తారా అన్న అనుమానం కలుగుతోంది.
ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన కొడుకు భాస్కర్ రెడ్డి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వయసులో ఆయనకు పార్టీ మారాల్సిన అవసరం లేదు... కానీ కొడుకు కోసం తప్పలేదని అంటున్నారు. ఏదేమైనా గత పదేళ్ళు పదవులు అనుభవించిన ఇప్పుడిలా కష్టకాలంలో బిఆర్ఎస్ ను వీడిన పోచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోచారం శ్రీనివాస్ రెడ్డి వీడియో వైరల్ :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. గత పదేళ్ళు ఎదురులేకుండా ఏకపక్ష విజయాలు సాధిస్తూవచ్చిన బిఆర్ఎస్ ఒక్క ఓటమితో ఢీలా పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పార్టీని వీడారు... కాంగ్రెస్ లేదా బిజెపి లో చేరారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది.
ఇలా గతంలో ఉన్నత పదవులు అనుభవించిన నాయకులు సైతం బిఆర్ఎస్ వీడిన సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దొంగలు పోయారు... నిఖార్సయిన నాయకులే ఇప్పుడు బిఆర్ఎస్ మిగిలారని అన్నారు. కొందరు స్వార్థపరులైన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు... గతంలో పదవులు అనుభవించి వారు ఇప్పుడు కష్టాల్లో వున్నపుడు మన నాయకుడు కేసీఆర్ కు దూరం అవుతారా..? అంటూ ప్రశ్నించారు. ఈ సమయంలోనే నేనున్నాను అంటూ మన నాయకుడికి ధైర్యం ఇవ్వాలి... అలాంటి ధైర్యమే నేను ఇస్తాను... ప్రాణం వున్నంతవరకు కేసీఆర్ తోనే వుంటాను అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇలా మాట్లాడిన ఆయనే ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరారు. దీంతో పోచారం గతంలో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారు బిఆర్ఎస్ నాయకులు.