ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Padi Kaushik Reddy Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదవగా తాజాగా అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై బెదిరింపుకుల సంబంధించిన సెక్షన్ 308(2),308(4), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆయనను విచారణ నిమిత్తం వరంగల్ కు తరలిస్తున్నట్లు సమాచారం.
కమలాపురం మండలం వంగపల్లకి చెందిన క్వారీ యజమాని మనోజ్ ను బెదిరించారన్న ఆరోపణలతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది. తన భర్తను రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టేందుకు సిద్దమయ్యారు.