Asianet News TeluguAsianet News Telugu

మంత్రి మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు.. సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అధికార బీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్టుగా సమాచారం.

BRS leadership focus on Infighting in Medchal district
Author
First Published Dec 20, 2022, 11:13 AM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అధికార బీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. జిల్లాలోని  ఎమ్మెల్యేలు, అదే జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి మధ్య నెలకొన్న అంతర్గత పోరును అధిష్టానం సీరియస్‌గా తీసుకన్నట్టుగా సమాచారం. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు.. బేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్‌), కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), అరికపూడి గాంధీ (శెరిలింగంపల్లి) సమావేశమయ్యారు. మైనంపల్లి హన్మంతరావు  నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. తమ ఆవేదనను వ్యక్తి చేశారు. అయితే ఈ పరిణామాలపై పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఈ సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి మల్లారెడ్డిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ‌లో క్రమశిక్షణను ఉల్లంఘించి.. ఒకరిపై ఒకరు ప్రజల్లోకి వెళ్లి పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలుంటాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నేతలకు హెచ్చరికలు జారీచేశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

అయితే తన అంగీకారం లేకుండా ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎలాంటి ప్రతిపాదనలను ఆమోదించవద్దని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలియడంతో వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నామినేషన్ పదవులకు సంబంధించి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలకు రొటేషన్ పద్ధతిని అనుసరించకుండా మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి తన అనుచరులకే ఎక్కువ పదవులు ఇవ్వడం ఎమ్మెల్యేల ఆగ్రహానికి మరో కారణంగా తెలుస్తోంది.

ఇక, సోమవారం సమావేశం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. మంత్రి  మల్లారెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని.. జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా ఉన్న ఆయన ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేకపోయినందున తమ నియోజకవర్గాల్లో వివిధ నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో తన అనుచరులను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, గ్రంథాలయ కమిటీ చైర్మన్‌గా నియమించారని అన్నారు. ఇలా ప్రధాన పదవులన్నీ మల్లారెడ్డి మేడ్చల్‌ నియోజకవర్గానికే తీసుకెళితే.. ఇతర నియోజకవర్గాల్లోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయగలం అని ప్రశ్నించారు. ఇక, ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. 

అయితే ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి.. ఐదుగురు ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారో, ఏం చర్చించారో తనకు తెలియదని అన్నారు. జిల్లాలో తనకు, వాళ్లకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పారు. పార్టీ కోసం కలిసి పని చేస్తున్నామని.. భవిష్యత్తులోనూ అలానే కొనసాగుతామని తెలిపారు. తమ మధ్య ఏవైనా సమస్యలుంటే సామరస్యంగా చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios