రోడ్ రోలర్ గుర్తును రద్దు చేయాలి.. ఈసీకి బీఆర్ఎస్ నేతల అభ్యర్థన..
రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతల బృందం కోరింది.

న్యూఢిల్లీ: రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతల బృందం కోరింది. తెలంగాణలో యుగ తులసి పార్టీకి కేటాయించిన ‘రోడ్ రోలర్’ గుర్తును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేసింది. ‘రోడ్ రోలర్’ చిహ్నాన్ని రద్దు చేయాలని, బీఆర్ఎస్ కారు గుర్తును పోలిన గుర్తులను కాకుండా ఇతర ఉచిత చిహ్నాలను యుగ తులసి పార్టీకి కేటాయించాలని వారు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. యుగ తులసి పార్టీ కోసం రోడ్ రోలర్ గుర్తును రద్దు చేయకపోవడం ఖచ్చితంగా బీఆర్ఎష్ పార్టీ ఫలితాలపై దుష్ప్రభావం చూపుతుందని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసి బీఆర్‌ఎస్ నేతల బృందంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్, ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. తెలంగాణలో ఉచిత చిహ్నాల జాబితా నుంచి 2011 నవంబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం.. రోడ్ రోలర్‌ని తొలగించిందని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్ 1968లోని పారా 10బీ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ గుర్తు మళ్లీ ఉచిత గుర్తుల జాబితాలో చేర్చబడిందని.. యుగ తులసి పార్టీకి కేటాయించబడిందని అన్నారు.
ఇక, కారు, రోడ్ రోలర్ గుర్తు సైజును ఈవీఎంకు సరిపోయే రియల్ సైజుకు కుదిస్తే.. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వృద్ధులు, నిరక్షరాస్యులు రెండింటి విషయంలో గందరగోళం చెందుతారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిరక్షరాస్యులు, వృద్ధులైన ఓటర్లు రోడ్డురోలర్‌ను కారు గుర్తుగా పొరబడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇది బీఆర్ఎస్‌కు ప్రతికూల అంశంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కారును పోలిన గుర్తులపై పోటీచేసిన అభ్యర్థులకు జాతీయ పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల కన్నా అధిక ఓట్లు వచ్చాయని చెప్పారు.