MLC nomination: ఎమ్మెల్సీలుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్‌ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్‌ హైకోర్టు విచారించనున్నది.  డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణను దాఖలు చేసిన పిటిషన్ ను ఈ నెల 5న న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయనున్నది.   

MLC nomination: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్రా సత్యనారాయణలను నామినేట్‌ చేయాలని కోరుతూ గత ప్రభుత్వం (కేసీఆర్‌ సర్కారు) గవర్నర్ కు సిఫారసు చేయగా.. ఈ నామినేషన్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఆ ఇద్దరూ "రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు" అనే కారణంతో గవర్నర్ సెప్టెంబర్ 19న ఆ నామినేషన్లను తిరస్కరించింది. ఈ చర్యను సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5న విచారణకు రానుంది.

పిటిషనర్ల ప్రకారం.. శాసనమండలిలోని ఖాళీలను “గవర్నర్ కోటా” కింద భర్తీ చేయడానికి సాహిత్యం,సైన్స్, కళ, సహకార ఉద్యమం, సామాజిక సేవలలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తులను నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని, రాజ్యాంగం ఆ హక్కును రాష్ర్ట ప్రభుత్వానికి ఉందని తెలిపారు. మంత్రి మండలి సిఫార్సులను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ‘వ్యక్తిగత సంతృప్తి లేకపోవడం’ వల్లే జరిగిందని, సిఫారసులో ఎలాంటి అస్పష్టత లేదని, ఇది ఏకపక్షం నిర్ణయం కాబట్టి చట్టవిరుద్ధమని పిటిషనర్లు తీవ్రంగా వాదిస్తున్నారు. ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్‌ తిరస్కరించటం దుర్మార్గం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్‌ ఆమోదించి తీరాలని తెలిపారు.

గవర్నర్ చర్యపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించింది. ఆర్టికల్‌ 171 (5) ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని పేర్కొన్నారు. అయితే.. గవర్నర్‌ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయటం వీలుకాదంటూ గవర్నర్‌పై ఎలాంటి క్రిమినల్ చర్యలు ప్రారంభించరాదని పేర్కొంటున్న ఆర్టికల్ 361 కారణంగా రిట్ పిటిషన్ పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.

 ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు సిరీయస్ గా తీసుకున్నారు. తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌ పదవికి అనర్హుడని పేర్కొన్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ఇద్దరు విశ్వసనీయ నేతలను అనర్హులుగా పేర్కొన్న గవర్నర్ అనర్హురాలని ఆయన అన్నారు. వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన సత్యనారాయణ జాతీయ స్థాయిలో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని కేటీఆర్ సూచించారు.