బిఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాాయితీ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పార్టీలో అసమ్మతి బయటపడింది.
భువనగిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ లో కలకలం రేపింది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కొందరు ఇప్పటికే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇతర పార్టీలవైపు చూస్తుండగా మరికొందరు నాయకులు అదే బాటలో నడిచేందుకు సిద్దమవుతున్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకోడానికి సిద్దమవుతున్నారు. ఇలా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన, కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇవాళ అనుచరులతో సమావేశం కానున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టే సమయంలో దళిత నాయకుడైన మోత్కుపల్లి నర్సింహులుకు సీఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో బిజెపిలో వున్న మోత్కుపల్లిని కేసీఆర్ బిఆర్ఎస్ లో ఆహ్వానించారు. దీంతో బిఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లికి దళితబంధు పథకం బాధ్యతలు గానీ, ఎమ్మెల్సీ పదవిగానీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏ పదవి దక్కలేదుకదా హుజురాబాద్ ఎన్నికల తర్వాత కనీసం ఆయనకు సీఎం అపాయింట్ మెంట్ కూడా దక్కలేదట. దీంతో ఇప్పటికే బిఆర్ఎస్ లో అవమానాలు ఎదురవుతున్నాయని భావిస్తున్న మోత్కుపల్లికి అభ్యర్థుల జాబితాలోనూ మొండిచేయి ఎదురయ్యింది. దీంతో మరింత అసంతృప్తికి గురయిన ఆయన తన రాజకీయ భవిష్యత్ పై చర్చించేందుకు సన్నిహితులు, అనుచరులతో సమావేశం అవుతున్నారు.
బిఆర్ఎస్ లో చేరే సమయంలోనే మోత్కుపల్లి ఆలేరు టికెట్ ఆశించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ తాజాగా ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారట. టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా కనీసం సిట్టింగ్ లకే మళ్లీ టికెట్లు ఇస్తున్నామని బిఆర్ఎస్ పెద్దలు చెప్పలేదన్న ఆవేదన ఆయనలో వుందని అనుచరులు అంటున్నారు. ఇలా బిఆర్ఎస్ లో అవమానాలు ఎదురవుతుండటంతో మోత్కుపల్లి ఇవాళ్టి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Read More సరైన సమయంలో స్పందిస్తా: కులంపై రేఖానాయక్ ఆరోపణలపై జాన్సన్ నాయక్
భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సన్నిహితులు, అనుచరులతో మోత్కుపల్లి నర్సింహులు సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బిఆర్ఎస్ లో అవకాశం దక్కలేదు... కాబట్టి ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది. మోత్కుపల్లి బిఆర్ఎస్ ను వీడతారా? ఒకవేళ వీడితే ఏ పార్టీలో చేరతారు? అంటూ అప్పుడే రాజకీయ చర్చ మొదలయ్యింది.
